Saturday, 12 July 2008

కీమా పరోటా


కావలసిన పదార్ధాలు :

బాగా మెత్తగా గ్రైండ్ చేసిన కీమా - పావు కిలో

గోధుమ పిండి - పావు కిలో

ఉప్పు - అర టీ స్పూన్

నూనె లేక నెయ్యి - పావు కప్పు

మసాలా పొడి - ఒక టీ స్పూన్

అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్

పసుపు - పావు టీ స్పూన్


తయారు చేయు విధానం : ముందుగా కీమా లో కొద్దిగా నీరు పోసి అందులో పసుపు, ఉప్పు మరియు అల్లమ వెల్లుల్లి ముద్ద వేసి బాగా మెత్తగా నీరు మొత్తం ఇంకేవరకు ఉడకనివ్వాలి. తరువాత ఉడికిన కీమా ముద్దలో గరం మసాలా పొడి వేసి బాగా కలిపి మరొక్క సారి గ్రైండ్ చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. గోధుమ పిండి లో చిటికెడు ఉప్పు వేసి, కాగిన నూనె గాని నెయ్యి వేసి పూరి పిండిలా ముద్ద చేసుకొని ఒక్క గంట పక్కన పెట్టుకోవాలి. తరువాత పూరి పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పరోటాలుగా పలుచగా వత్తుకోవాలి. తరువాత ఒక పరోటా తీసుకొని దానిమీద కీమా ఉండని పలుచగా పరిచి, పైన మరో పరోటా పెట్టి తడిచేత్తో అంచులు విడిపోకుండా నొక్కాలి. ఇలా పరోటాలు చేసుకొని, మామూలు పెనం మీద కొద్దిగా నూనె కాని నెయ్యి కాని వేసి రెండువైపులా కాల్చుకోవాలి. అంతే మీరు ఇష్టపడే కీమా పరోటాలు రెడీ!!