Sunday 27 April 2008

కైమా కబాబ్

కావలసిన పదార్ధాలు :-
కైమా పావు కిలో
లవంగాలు మూడు
ఏలకులు రెండు
దాల్చినచెక్క రెండు
ఉల్లిపాయలు రెండు
అల్లం ఒక్క అంగుళం
గసగసాలు టీ స్పూన్
సెనగపప్పు టేబుల్ స్పూన్ (పుట్నాల పప్పు)
వెల్లుల్లి ఆరు రేకులు
కారం టీ స్పూన్
నూనె ఒక్క కప్పు
కోడిగ్రుడ్డు ఒక్కటి
పచ్చి మిర్చి రెండు
గట్టి పెరుగు అరకప్పు
తయారు చేయు విధానం :-
కైమా కడిగి, అందులో ఒక ఉల్లిపాయ కోసి, ఉప్పు, కారం, మసాలా ముద్ద ( ఎలక్కాయ, లవంగాలు, దాల్చినచెక్క, అల్లం వెల్లుల్లి )వేసి ఒక పావుగ్లాస్ నీరు పోసి నీరంతా ఇగిరేవరకు ఉడకనివ్వాలి. గసగసాలు, సెనగపప్పు తో కైమా కూడా మెత్తగా మిక్సి లో రుబ్బుకొని కోడిగ్రుడ్డు వేసి బాగా కలపాలి. పచ్చి మిర్చి, ఉల్లిపాయ సన్నగా ముక్కలు కోసుకొని, పెరుగులో కలిపి నాననివ్వాలి.(పెరుగు గట్టిగా ఉంటే మంచిది).

నూరిన కైమాని, చిన్న చిన్న ఉండలుగా చేసి దాన్ని అరచేతిలో పెట్టి కొంచెం పలుచగా చేసుకొని వాటిమీద పెరుగుతో కలిపెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి మిశ్రమాన్ని ఒక్క స్పూన్ వేసి దానిమీద రెండో ఉండతీసుకొని నెమ్మదిగా నొక్కుతూ అతికించాలి . తరువాత బాణలిలో నూనె పోసి బాగా కాగానిచ్చి అందులో ఒక్కటి ఒక్కటి వేసి దోరగా వేపుకోవాలి. ఇంక మీ కైమా కబాబ్ రెడీ అయినట్లే!!

Saturday 26 April 2008

చేపల వేపుడు


కావలసిన పదార్ధాలు :-
చేప కొంచెం పెద్ద సైజ్ ఒక్కటి
ఉప్పు కావలసినంత
కారం రెండు టీ స్పూన్స్
నూనె ఐదు టేబుల్ స్పూన్స్
అల్లం వెల్లుల్లి పేస్టు ఒక్క టీ స్పూన్
కొంచెం గరం మసాలా
తయారు చేయు విధానం :-
ముందు ఫిష్ ని సుబ్బరం చేసి దాన్ని అడ్డంగా కొంచే పలుచగా కోసువాలి. కోసిన చేప ముక్కలకి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి, గరం మసాల వేసి కలిపి ఒక్క అరగంట పక్కన పెట్టుకోవాలి. తరువాత పొయ్యి వెలిగించుకొని బాణలి పెట్టి నూనె వేసి రెండు నిమిషాల తరువాత అందులో ఈ చేప ముక్కలు ఒక్కొక్కటి వేసి నెమ్మదిగా కర కర లాడేలా వేపుకోవాలి. అంతే ఎంతో రుచి గా ఉండే చేపల వేపుడు రెడీ!!!!!!

మటన్ పులుసు


కావలసిన పదార్ధాలు :-
పావు కిలో మాంసం
ధనియాలు ఒకటిన్నర టేబుల్ స్పూన్
ఉల్లిపాయలు రెండు
పది ఎండుమిరపకాయలు
ఒక్క అంగుళం అల్లం ముక్క
వెల్లుల్లి చిన్నది ఒక్కటి
ఉప్పు ఒక టేబుల్ స్పూన్
పసుపు చిటికెడు
రెండు టేబుల్ స్పూన్స్ నూనె
ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యి
రెండు లవంగాలు, రెండు ఏలకులు
రెండు దాల్చినచెక్కలు

తయారు చేయు విధానం:-


ఒక్క టేబుల్ స్పూన్ నూనె వేసి మిరపకాయలు నల్లబడకుండా ధనియాలతోసహా వేయించుకోవాలి. ఈ వేయించుకున్న సామానూ, అల్లం వెల్లుల్లి వేసి మెత్తగా మిక్సీ లో నూరాలి. ఉల్లిపాయ సన్నగా తరిగిపెట్టుకొని ఒక్క పాత్ర పొయ్యి మీద పెట్టి మిగతా నూనె, నెయ్యి వేసి ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఉల్లిపాయలు కూడా వెయ్యాలి. దోరగా వేగాకా మాంసంవేసి ఒక్క పది నిమిషాలు నీరంతా ఇగరనిచ్చి ఈ నూరిన ముద్ద, ఉప్పు, పసుపు వేసి కలపాలి. కొంచెం సేపు వేగాకా రెండు గ్లాసులు నీరుపోసి, ముప్పావు గ్లాసు ఉందనగా దించి కొత్తిమీర వేసుకుంటే భాగుంటుంది. దీనికి నిమ్మకాయ కాని చింత పండు కాని వెయ్యకూడదు ఉంటే ఒక్క టమాటా నాలుగు ముక్కలుగా కోసి ఉల్లిపాయలతో పాటు తాలింపు లో వేస్తే బాగుంటుంది.

మటన్ ఫ్రై




కావలసిన పదార్ధాలు :-
మాంసం - పావు కిలో
నెయ్యి - ఒక్క టేబుల్ స్పూన్
నూనె - రెండు టేబుల్ స్పూన్స్
ధనియాలు - ఒక్క టేబుల్ స్పూన్
ఉప్పు - హల్ఫ్ టేబుల్ స్పూన్
ఎండు మిర్చి - ఆరు
ఉల్లిపాయలు పెద్దవి -రెండు
వెల్లుల్లి చిన్నది - ఒక్కటి
అల్లం - అంగుళం
గసగసాలు - ఒక్క టేబుల్ స్పూన్
తయారు చేయు విధానం:-
ఎలక్కాయలు, దాల్చిన చెక్క ఒట్టి బాణలిలో చిటపట లాడే వరకు వేయించి మెత్తగా పొడి కొట్టి పెట్టుకోవాలి. ధనియాలు, ఎండుమిర్చి కొంచెం నూనె వేసి వేయించుకోవాలి. ఈ వేయించుకున్నవి అల్లం-వెల్లుల్లి వేసి కొంచెం గరుగ్గా నూరుకోవాలి. ఉల్లిపాయ సన్నగా కోసి, ముక్కలు, నూరిన ముద్ద, కొంచెం పసుపు, ఉప్పు మాంసం లో వేసి ఒక్క గ్లాస్ నీరు పోసి బాగా ఉడికేవరకు ఉడకపెట్టాలి. తరువాత పోయ్యివేలింగించుకొని బాణలి పెట్టి మూడు టేబుల్ స్పూన్స్ నూనె, ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కాగిన తరువాత మిగిలిన ఉల్లిపాయ కోసి అందులో వేసి దొరగా వేగాకా, ఉడికిన మాంసం ముక్కలు కూడా వేసి పదినిమిషాలు వేగనిచ్చి, కొట్టి పెట్టిన మసాలా పొడి దానిమీద చల్లి ఐదు నిమిషాల పాటు వేగాకా ఒక్క బౌల్ లో తీసుకొని కోత్తిమీరతో అందంగా అలంకరించుకోవాలి . అంతే ఎంతో నోరూరించే మటన్ వేపుడు రెడీ!!!!!!!

Thursday 24 April 2008

మెంతి కూర మేక మాంసం




కావలసిన పదార్ధాలు :-
మాంసం - అరకిలో
నెయ్యి లేక నూనె - రెండు టేబుల్ స్పూన్స్
ధనియాలు - ఒక టేబుల్ స్పూన్
గసగసాలు - టేబుల్ స్పూన్
పసుపు- అర టీ స్పూన్
అల్లం - అంగుళం ముక్క
వెల్లుల్లి - పది రెబ్బలు
ఉల్లిపాయలు - రెండు
టొమాటోస్ - రెండు పెద్దవి
గరం మసాల - ఒక్క టేబుల్ స్పూన్
మంచి పెరుగు - ఒక్క కప్పు
పొదీనా - పది రెబ్బలు
కోత్తిమీర - ఒక్క కట్ట
కరివేపాకు - కొంచెం
ఉప్పు - కావలసినంత
మెంతి కూర - ఐదు గుప్పిల్లు

తయారు చేయు విధానం :- ముందుగా మెంతికూర సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక్క ఉల్లిపాయ తీసుకొని ముక్కలుగా కోసుకోవాలి. టొమాటోలు మెత్తగా చేసి పక్కన పెట్టుకోవాలి. గసగసాలు, గరం మసాలా, ధనియాలు, ఎండుమిర్చి, ఉప్పు, పసుపు, వెల్లుల్లి అల్లం, ఒక్క ఉల్లిపాయ, పొదీనా, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసి మెత్తగా ముద్ద నూరి ఈ ముద్ద లో మాంసం , పెరుగు, మెంతికూర వేసి బాగా కలిపి ఒక్క గంట నానపెట్టాలి. పొయ్యి మీద బాణలి పెట్టి అందులో నెయ్యి గాని నూనె గాని వేసి కాగనిచ్చి ఉల్లిముక్కలు వేసి ఎర్రగా వేగాకా అందులో కలిపి పెట్టుకున్న మాంసం వేసి, అడుగంటకుండా తిప్పుతూ దానిలో నీరంతా ఇగర నివ్వాలి . మెత్తగా చేసిపెట్టుకున్న టొమాటోలలో ఒక్క అర కప్పు నీరు పోసి, కలిపి కూరలో పోసేయ్యాలి. ఈ నీరంతా ఇగిరిన తరువాత స్టవ్ మీద నుండి దించేసి ఒక్క ప్లేట్ లోకి తీసుకొని కొంచెం కోత్తిమీరతో అందంగా అలంకరించుకోవాలి. ఈ కూర కొంచెం పుల్లగా, మెంతి కూర సువాసనతో చాల రుచిగా ఉంటుంది.




Tuesday 22 April 2008

చికెన్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్


కావలసిన పదార్ధాలు :-
బోన్ లెస్ చికెన్ - హల్ఫ్ కిలో
పచ్చి బటాని - ఒక్క కప్
ఇండియన్ బీన్స్ - రెండు కప్పులు
క్యారెట్ ముక్కలు - రెండు కప్పులు
సన్నగా తరిగిన క్యాబేజ్ - రెండు కప్పులు
ఉల్లిపాయలు - రెండు
పచ్చి మిర్చి - నాలుగు
క్యాప్సికం - ఒక్క కప్
కోడిగుడ్లు - ఆరు
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక్క పెద్ద టేబుల్ స్పూన్

పసుపు చిటికెడు
నూనె - పావు కిలో
నెయ్యి - రెండు టేబుల్ స్పూన్స్
సోయ సాస్ - రెండు టేబుల్ స్పూన్స్ (కొంచెం నీళ్ళల్లో కలపాలి )
సాల్ట్ తగినంత

అన్నం లోకి :-
భాస్మతి బియ్యం - ఒక్క కిలో
దాల్చిన చెక్క - అంగుళం సైజ్ రెండు
లవంగాలు - ఆరు
ఏలకులు - ఆరు
జీడి పప్పు - హల్ఫ్ కప్
చైనా సాల్ట్ - చిటికెడు
సాల్ట్ తగినంత


తయారు చేయు విధానం :- ముందుగా భాస్మతి బియ్యాన్ని బాగా కడుక్కొని అందులో నీరు పోసి దాల్చిన చెక్క, లవంగాలు, ఏలకులు, చైనా సాల్ట్ , ఉప్పు, ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఉడకనివ్వాలి. ఉడికిన అన్నాన్ని ఒక్క పెద్ద గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత చికెన్ ని సుబ్బరంగా కడిగి అందులో కొద్దిగా నీరు పోసి అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు,కొద్దిగా ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఉడికిన చికెన్ ని తీసుకొని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా చిదిమి పక్కన పెట్టుకొని, పొయ్య వెలిగించి దాని మీద బాణలి పెట్టి నూనె వేసి కొంచెం వేడి అవ్వనిచ్చి అందులో కూరగాలన్ని విడి విడి గా వేపుకొని ఉడికిన రైస్ లో కలుపుకోవాలి. తరువాత బాణలి లో మల్లి నూనె పోసి అందులో చిదిమిన చికెన్ ని వేసి బాగా వేపుకొని దాన్ని కూడా రైస్ లో కలపాలి. తరువాత మల్లి బాణలిలో నూనె పోసి ఉల్లిపాయముక్కలు వేసి బాగా వేగేకా అందులో నీళ్ళల్లో కలిపిన సోయా సాస్ పోసి కొంచెం వేగనిచ్చి దాన్ని కూడా రైస్ లో కలపాలి చివరిగా మల్లి బాణలిలో నూనె పోసి అందులో కోడిగుడ్లు కొట్టి బాగా వేపుకొని దాన్ని కూడా అన్నం లో వేసి బాగా కలుపుకోవాలి. వీటన్నింటితో ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యి వేసి రైస్ ని బాగా కలుపుకొని కొత్తిమీర, వేపిన జీడిపప్పు తో అందంగా అలంకరించుకొని ఒక్క బౌల్ లోకి తీసుకోవాలి. ఇది తినదాకి చాలా రుచికరంగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి!!!!!!

పులస చేప పులుసు


కావలసిన పదార్ధాలు :-

పులస చేప - కిలో చేప

ఉల్లిపాయలు - నాలుగు మీడియం సైజ్

పచ్చిమిర్చి - నాలుగు

టమాటో - ఒక్కటి పెద్దది

వంకాయలు - చిన్నవి రెండు

బెండకాయలు - నాలుగు

అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు టీ స్పూన్స్

జీలకర్ర పొడి - రెండు టీ స్పూన్స్


ధనియాల పొడి - రెండు టీ స్పూన్స్


గరం మసాల - హాఫ్ టీ స్పూన్

కారం - రెండు టీ స్పూన్స్

పసుపు చిటికెడు

ఉప్పు తగినంత


తయారు చేయు విధానం :- ముందుగా పులస చేపకి పొలుసు తీసి సుబ్బరం చేసుకొని మరీ సన్నగా కాకుండా కొంచెం మందంగా ముక్కలుగా కోసుకొని వాటిలో ఉప్పు, కారం, ధనియాలపొడి వేసి అన్ని ముక్కలకి పట్టెలా కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఉల్లిపాయలను మిక్సి లో మరీ మెత్తగా కాకుండా రుబ్బుకోవాలి. పొయ్యి వెలిగించుకొని బాణలి పెట్టి నూనె వేసుకొని ఒక్క నిమిషం తరువాత అందులో ఉల్లిముద్ధ, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కొంచెం కొంచెం తరువాత అందులో చింతపండు పులుసు, చేపముక్కలు, కోసి ఉంచుకున్న బెండకాయ, వంకాయ ముక్కలు వేసి మూత పెట్టి మరగనివ్వాలి. కొంచెం చిక్కగా మరిగాకా చివరిగా కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. అంతే మీ పులస పులుసు రెడీ!!!!

Friday 18 April 2008

చీల పొట్టు మామిడికాయ ( రొయ్య పొట్టు )

కావలసిన పదార్ధాలు :-

చీల పొట్టు (రొయ్య పొట్టు ) - అరకిలో
కొంచెం లేత మామిడి కాయలు - పుల్లగా ఉన్నవి రెండు
ఉల్లిపాయ - కొంచెం పెద్దది ఒక్కటి
పచ్చిమిర్చి - నాలుగు
నూనె - రెండు టేబుల్ స్పూన్స్
కారం - ఒక్క టీ స్పూన్
పసుపు - చిటికెడు
గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర



తయారు చేయు విధానం :- ముందుగా చీల పొట్టు (రొయ్యపట్టు) ని బాగా సుబ్బరం చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించుకొని అందులో నూనె పోసి అది కాగాక అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా చీల్చిన పచ్చిమిర్చి వేసి బాగా వేపుకోవాలి. తరువాత అందులో ఉప్పు కారం, పసుపు, వేసి అవి కూడా ఒక్క నిమిషం వేగాక అందులో మామిడి కాయ ముక్కలు, చీలపోట్టు వేసి కొంచెం నీరు పోసి మూతపెట్టి ఒక్క పది నిమిషాలు నీరు అంతా ఇంకేవరకు ఉడకనిచ్చి ఒక్క గిన్నెలోకి తీసుకొని కోత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అంతే ఎంతో రుచిగా ఉండే చీలపోట్టు మామిడికాయ రెడీ!!!

Tuesday 15 April 2008

కట్టచేపల ఇగురు







కట్ట చేపలు - రెండు
ఉల్లిపాయలు - మూడు కొంచెం పెద్దవి
పచ్చి మిర్చి - మూడు
అల్లం - ఒక్క అంగుళం ముక్క
వెల్లుల్లి రెబ్బలు -నాలుగు
జీలకర్ర - ఒక్క టీ స్పూన్
నూనె -రెండు టేబుల్ స్పూన్స్
పసుపు - కొంచెం
ఉప్పు, కారం తగినంత
అందంగా అలంకరించడం కోసం కొంచెం కోతిమీర, నాలుగు పచ్చి మిరపకాయలు




తయారు చేయు విధానం :-



ముందు గా కట్టచేపలు తీసుకొని వాటిని బాగా సుబ్బరం చేసుకొని వాటిని ముక్కలుగా కోసుకొని ఉప్పు, కారం పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఈ లోగా ఉల్లిపాయలు పెదగా ముక్కలు చేసుకొని వాటిని మిక్సి లో వేసి కొంచెం గరుగ్గా రుబ్బుకోవాలి. అలానే అల్లం, వెల్లుల్లి, జీలకర్ర తీసుకొని వాటిని కూడా మిక్సి లో వేసి మెత్తగా పేస్టు లాగా చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక్క బాణలి పెట్టి అందులో నూనె వేసుకొని కొంచెం కాగాకా అందులో ఉల్లి ముద్ద, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసి బాగా వేపుకోవాలి. వేగిన ఉల్లి ముద్దలో అల్లం, వెల్లుల్లి, జీలకర్ర ముద్దని వేసి బాగా వేగాక అందులో కొద్దిగా నీరు వేసి కట్ట చేపల ముక్కలను కూడా అందులో వేసి మూత పెట్టి ఒక్క పది నిమిషాలు ఉడకనివ్వాలి. తరువాత మూత తీసేసి నీరు ఇంకవరకు అంటే బాగా దగ్గర అయ్యేవరకు ఉండనిచ్చి స్టవ్ ఆఫ్ చెయ్యాలి. అంతే ఎంతో రుచిగా నోరూరించే కట్టచేపల ఇగురు రెడీ!!!

Tuesday 8 April 2008

యానం స్పెషల్ చీర మీను గారెలు




చీర మీను గారెలకి కావలసిన పదార్ధాలు :-
చీర మీను (సిల్వర్ ఫిష్ ) - అరకిలో
ఉల్లిపాయలు - రెండు
పచ్చిమిర్చి - నాలుగు
సెనగపిండి - నాలుగు పెద్ద స్పూన్స్
కోడిగుడ్లు - రెండు
లవంగాలు -నాలుగు
ఏలకులు - రెండు
దాల్చిన చెక్క - ఒక్క అంగుళం
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక్క పెద్ద స్పూన్
కార్న్ ఫ్లౌర్ - రెండు టేబుల్ స్పూన్స్
కారం కొంచెం, ఉప్పు తగినంత

తయారు చేయు విధానం :-

ముందుగా చీరమీను బాగా కడిగి నీరు అంతా పోయేవరకు ఆగి అందులోముందుగా గ్రైండ్ చేసిన ఉల్లి పచ్చిమిర్చి ముద్ద, పైన చెప్పిన లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క పోదిచేసుకొని ఈ చీరమీనులో వేసి, కోడిగుడ్లు అందులో వేసి కలపాలి తరువాత సెనగపిండి, కార్న్ ఫ్లౌర్, కారం, అల్లంవెల్లుల్లి పేస్టు వెసి తగినంత ఉప్పు వెసి నీరు పోయ్యకుండా బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా పోయ్యమీద భానాలి పెట్టి అందులో గారెలు ములిగేలా నునే వేసుకొని భాగా వేడెక్కిన తరువాత అన్ని కలిపి పక్కన పెట్టుకున్న చీర మీను ముద్దని తీసుకొని పల్చగా గారెలు లాగా చేసుకొని తక్కువ మంటమీద కొంచెం ఎర్రగా వచ్చేలా వేపుకొని వాటిని ప్లేట్ లోకి తీసుకోవాలి అంతే ఎతో చక్కగా కరకరలాడే చీరమీను గారెలు రెడీ. ఇవి రైస్ లో సాంబార్ తో పాటు తిన్న కూడా భాగుంటాయి.